Srimad Valmiki Ramayanam

Balakanda Sarga35

Story of Ganga and Parvati !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ముప్పదిఇదవ సర్గము
( గంగా పార్వతుల కథ )

ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః|
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోsభ్యభాషత ||

తా|| మిగిలిన రాత్రి ఆ శోణానదీ తీరమున ఆ మహర్షులతో గడిపి రాత్రి తరువాత సుప్రభాత సమయములో విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

సుప్రభాత నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే గమనాయాభిరోచయ ||

తా|| 'ఓ రామా! రాత్రి గడిచినది సుప్రభాత పూర్వ సంధ్యాసమయమైనది. లెమ్ములెమ్ము.నీకు శుభమగుగాక. ప్రయాణమునకు సిద్ధము కమ్ము'.

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్ |
గమనం రోచయామాస వాక్యం చేద మువాచ హ ||
అయం శోణః శుభజలో గాఢః పులినమండితః |
కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయమ్ ||

తా|| ఆ మాటలను విని ఉదయపు కార్యక్రమములను నిర్వర్తించి , ప్రయాణమునకు సిద్ధమై రాముడు ఇట్లు పలికెను. ' ఈ శోణానది శభమైన జలములతో లోతుగా విలసిల్లు చున్నది. ఓ బ్రహ్మన్ ! మనము ఏవిధముగా ఈ నదిని దాటవలయును' అని.

ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోsబ్రవీదిదమ్ |
ఏషపంథా మయోద్దిష్టో యేన యాంతి మహర్షయః ||
ఏవముక్తాశ్చ ఋషయో విశ్వామిత్రేణ ధీమతా |
పశ్యంతస్తే ప్రయాతావై వనాని వివిధాని చ ||

తా|| ఈ విధముగా పలికిన రామునితో విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను."ఇచట మహర్షులు పయనించు మార్గము అదృష్టవశాత్ నాకు తెలుసును". ధీమంతుడైన విశ్వామిత్రుని వచనములను విని ఋషులందరూ అదే మార్గమున వివిధరకములైన వనములను చూచుచూ కొనసాగిరి.

తే గత్వా దూరమధ్వానం గతేsర్ధదివసే తదా |
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితామ్ ||
తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంస సారస సేవితామ్ |
బభూవుర్ముదితాస్సర్వే మునయః సహ రాఘవః ||

తా|| వారందరూ మద్యాహ్నమువఱకూ ప్రయాణము చేసి అత్యుత్తమమైన గంగానదీ తీరమునకు చేరిరి. ఆ హంసలతో ఇతర పక్షులతో సేవించబడుచున్న ఆ పుణ్యమైన జలములను చూచి ఆ రామునితో సహా మునులందరూ మహదానందపడిరి.

తస్యాస్తీరే తతశ్చక్రుః త ఆవాస పరిగ్రహమ్ |
తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పితృదేవతాః ||
హుత్వాచైవాగ్ని హోత్రాణి ప్రాశ్య చామృతవద్ధవిః |
వివిశుర్జాహ్నవీ తీరే శుచౌ ముదిత మానసాః ||
విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః |
అథ తత్ర తదా రామో విశ్వామిత్రం అథాబ్రవీత్ ||

తా|| అంతట వారు ఆ తీరములో ఒక ప్రదేశమును నివాసయోగ్యముగా చేసికొని , స్నానము చేసి యథావిధిగా పితృదేవతలకు తర్పణములిచ్చిరి. అగ్నికి హవిస్సులు సమర్పించి హవిషాన్నమును అమృతమువలె సేవించి ఆ జహ్నవీ తీరములో వారందరూ అత్యంత సంతోషపడిరి. అప్పుడు మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూ వారందరూ కూర్చుని ఉండగా , శ్రీరాముడు విశ్వామిత్రుని ఇట్లడిగెను.

భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథాం నదీమ్ |
త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిమ్ ||
చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః |
వృద్ధిం జన్మచ గంగాయా వక్తుమేవోపచక్రమే ||

తా|| 'భగవన్ ! గంగానది మూడులోకములలో ప్రవిహించునట్టి త్రిపథగా ఏట్లు పేరుపొందినది ? ఏవిధముగా నదులకు పతి యగు సాగరుని చేరినది?' అని. రామునిచే చెప్పబడిన ఆ మాటలను విని మహామునియగు విశ్వామిత్రుడు, గంగానదియొక్క జన్మ మరియూ వృద్ధి గురించి చెప్పసాగెను.

శైలేంద్రో హిమవాన్ నామ ధాతూనామకరో మహాన్ |
తస్య కన్యాద్వయం రామ రూపేణా ప్రతిమం భువి ||
యామేరు దుహితా రామ తయోర్మాతా సుమధ్యమా |
మేనా మనోరమా దేవీ పత్నీ హిమవతః ప్రియా ||
తస్యాం గంగేయమభవత్ జ్యేష్ఠా హిమవత్సుతా |
ఉమా నామ ద్వితీయాsభూత్ నామ్నా తస్యైవ రాఘవ ||

తా|| 'ఓ రాఘవా ! పర్వతములలో ఇంద్రునివంటి హిమవాన్ అను పేరుగల, అనేక ధాతువులతో సమ్మిళితమైన ఒక పర్వతము కలదు. ఆ హిమవంతమునకు అప్రతిమమైన రూపములుగల కుమార్తెలు ఇద్దరు ఉండిరి. మేరువు యొక్క సుందరమైన కుమార్తె మైనా హిమవంతుని భార్య . అతనికి ప్రియురాలు. ఆ హిమవంతుని కి గంగా జ్యేష్ఠ పుత్రి . ఉమా అనబడు ఆమె రెండవపుత్రి'.

అథ జ్యేష్ఠాం సురాస్సర్వే దేవతార్థ చికీర్షయా |
శైలేంద్రం వరయామాసుః గంగాం త్రిపథాం నదీమ్ ||
దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీమ్ |
స్వచ్ఛందపథగాం గంగాం త్రైలోక్య హితకామ్యయా ||

తా|| అంతట దేవతలందరూ దేవతార్థము కొఱకై జ్యేష్ఠ కుమార్తె యగు గంగను తమకు ఇవ్వమని ఆ శైలేంద్రుని అడిగిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావని నిరాటంకముగా సాగిపోవునట్టి తన తనయను మూడు లోకముల హితము కొఱకు దేవతలకిచ్చెను.

ప్రతిగృహ్య తతో దేవాః త్రిలోక హితకారిణః |
గంగామాదాయ తే sగచ్ఛన్ కృతార్థేనాంతరాత్మనా ||

తా|| ఆ గంగను ప్రతిగ్రహించి ఆ దేవతలు తాము కృతార్థులైనట్లు భావించి వెళ్ళిపోయిరి.

యా చాన్యా శైలదుహితా కన్యాssసీత్ రఘునందన |
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా ||
ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరస్సుతామ్ |
రుద్రాయా ప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్ ||

తా||ఓ రఘునందనా ! ఆ శైలెంద్రుని రెండవ కుమార్తె చాలా తీవ్రమైన వ్రత నిష్ఠతో తపస్సు చేసెను. అట్లు తీవ్రమైన తపస్సు చేసిన ఆ ఉమను హిమవంతుడు లోకములచే నమస్కరింపబడు రుద్రునకు ఇచ్చెను'.

ఏతేతే శైలరాజస్య సుతే లోక నమస్కృతే |
గంగా చ సరితాం శ్రేష్ఠా ఉమాదేవీచ రాఘవ ||

తా|| 'ఓ రాఘవా ! ఈ వి్ధముగా ఆ శైలేంద్రుని పుత్రికలు ఇద్దరూ నదులలో శ్రేష్ఠమైన గంగ , మరియూ ఉమాదేవి లోకములో పూజ్యులైరి.'

ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ |
ఖం గతా ప్రథమం తాత గతిం గతిమతాంవర ||

తా||' ఓ రామా ! త్రిపథగా గంగ ప్రథమముగా ఏట్లు వెళ్ళినదో ఈ విథముగా విశదీకరించితిని'

సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా |
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ ||

తా|| 'ఆనాడు హిమవంతునికి కుమార్తెగా జన్మించి సురలోకమునకు చేరిన నదియే ఈ పుణ్యప్రదమైన గంగా నది'

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే పంచ త్రింశస్సర్గః ||
సమాప్తం||

|| ఈ విధముగా వాల్మీకి రామాయణములోని బాలకాండలో ముప్పది ఇదవసర్గ సమాప్తము ||
||ఓమ్ తత్ సత్ ||